అప్పట్లో ఒకడుండేవాడు రివ్యూ మరియు రేటింగ్

 

 

రిలీజ్ డేట్: 30 డిసెంబర్ 2016
నటీనటులు: నారా రోహిత్‌.. శ్రీవిష్ణు.. తాన్య హాప్.. బ్రహ్మాజీ.. రాజీవ్‌ కనకాల
సంగీతం: సాయి కార్తీక్‌
ఛాయాగ్రహణం: నవీన్‌ యాదవ్‌
నిర్మాతలు: ప్రశాంతి.. కృష్ణ విజయ్‌
రచన..దర్శకత్వం: సాగర్‌ కె.చంద్ర

సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నారా రోహిత్, శ్రీ విష్ణు మరియు తాన్య హాప్ ప్రధాన పాత్రలలో నటించిన “అప్పట్లో ఒకడుండేవాడు” సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పటినుండి ఇండస్ట్రీ లో మంచి టాక్ తెచ్చుకున్న సినిమా. ఒక కొత్త కధతో సీరియస్‌ విషయాన్ని సిన్సియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనిపించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. కొత్త దర్శకుడు సాగర్‌ కె.చంద్ర ఈ అంచనాలను అందుకున్నాడా లేదా అనేది ఈ రివ్యూ లో చూద్దాం.

కధలోకి వెళ్తే: అది 1992, అప్పట్లో రైల్వే రాజు (శ్రీవిష్ణు) అనే క్రికెటర్‌ ఇండియన్ టీం లో ఆడాలనే లక్ష్యం కోసం కష్టపడుతుంటాడు అందుకోసం బాగా ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. రైల్వే రాజు నిత్య (తాన్య హాప్) ని ప్రేమిస్తాడు. అనుకోకుండా అతని జీవితంలోకి ఇంతియాజ్‌ (నారా రోహిత్‌) ప్రవేశిస్తాడు. నక్సలైట్లను ఏరి పారేసే పనిలో వుండే నిజాయతీగల పోలీస్‌ ఆఫీసర్ ఇంతియాజ్‌.

ఒక నక్సల్స్ గ్రూప్ తో రైల్వే రాజు కి సంబంధం వుంది అనే అనుమానంతో ఇంతియాజ్‌ అతనిని అరెస్ట్ చేస్తాడు, దాంతో అక్కడ్నుంచి రాజు జీవితమే మారిపోతుంది. ఓ హత్య కేసులోనూ ఇరుక్కుంటాడు. క్రికెటర్‌ కావాల్సిన రాజు క్రిమినల్‌ కావాల్సి వస్తుంది. ఆ తర్వాతేం జరిగింది? రైల్వేరాజుకీ ఇంతియాజ్‌కీ జరిగిన పోరాటంలో ఎవరు గెలిచారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..?: కథా నేపథ్యం.. దాన్ని చెప్పే తీరును పోలిస్తే.. ఇప్పుడొస్తున్న సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటుందీ చిత్రం. నక్సలైట్ల నేపథ్యం వచ్చే వరకూ కథ.. కథనాలు సాదాసీదాగానే సాగుతాయి. ఆ తరవాత సినిమా వేగం అందుకుంటుంది. నారా రోహిత్‌ పాత్ర ప్రవేశించటం.. శ్రీ విష్ణు హత్యా నేరంలో ఇరుక్కోవడం.. జైలు నుంచి బయటపడడం ఇవన్నీ ఉత్కంఠభరితంగానే సాగుతాయి. రైల్వే రాజు ఎదిగిన తీరు… సినిమాటిక్‌గానే సాగింది.

సెకండాఫ్ లో చాలాసేపటి వరకూ నారా రోహిత్‌ పాత్రే కనిపించదు. రైల్వే రాజు – ఇంతియాజ్‌ల పోరాటం కాస్త వన్‌సైడ్‌ అయిపోతుంది. మళ్లీ ఇంతియాజ్‌ పాత్ర కనిపించేంత వరకూ కథ.. కథనాల్లో ఎక్కడా ఉత్కంఠత ఉండదు. ఆ ఎపిసోడ్లు బోర్‌ కొట్టిస్తాయి. మళ్లీ పతాక సన్నివేశాల్లో దర్శకుడు తన మార్క్‌ చూపించుకోగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కథకు పూర్తి న్యాయం క్లైమాక్స్‌లోనే జరిగింది. దర్శకుడు ఈ కథని ముగించిన విధానం ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..?: ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నా.. ఆ స్థానం శ్రీ విష్ణు ఒక్కడికే దక్కుతుంది. క్రికెటర్‌ కావాలని కలలుకన్న యువకుడిగా.. అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కున్న సామాన్యుడిగా.. రౌడీగా.. ఇలా చాలా రకాల పార్శా్వలు చూపించాడు. పతాక సన్నివేశాల్లో నటన రక్తికట్టించడానికి తన అనుభవం సరిపోలేదు గానీ.. మిగిలిన చోట్ల బాగా రాణించాడు.

నారో రోహిత్‌ కూడా ఎప్పటిలానే బేస్‌ వాయిస్‌తో ఆకట్టుకొన్నాడు. సేటుగా బ్రహ్మాజీ నటన ఆకట్టుకొంది. కథానాయిక పాత్ర కొంచెం బలహీనంగా వుంది. శ్రీనివాసరెడ్డి ఒకే ఒక్క కామెడీ ట్రాక్‌లో కనిపించాడు. అదీ సినిమాకి అనవసరమే. కెమెరా ఈ కథ అవసరానికి తగ్గట్టు పని చేసింది. పాటలు కథాగమనానికి అడ్డుకునేలా కనిపిస్తాయి. నేపథ్య సంగీతంతో సన్నివేశం స్థాయిని పెంచేశాడు సంగీత దర్శకుడు. మాటలు మరీ అంత లోతుగా లేకపోయినా.. ఎంత వరకూ వాడాలో అంతే వాడారు.

 

బలాలు

  • స్టోరీ
  • ద్వితీయార్ధం
  • పతాక సన్నివేశాలు
  • నేపథ్య సంగీతం

 

బలహీనతలు

  • ప్రధమార్ధం
  • సాంగ్స్
  • కథానాయిక

 

రేటింగ్:  2.75/5

 

(Visited 58 times, 1 visits today)

Comments