గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ రివ్యూ మరియు రేటింగ్

గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ రివ్యూ మరియు రేటింగ్

 

విడుదల తేదీ : జ‌న‌వ‌రి 12, 2017

దర్శకత్వం : అంజన పుత్ర క్రిష్

నటీనటులు : రామపుత్ర బాలకృష్ణ, నీరజ పుత్రిక శ్రియ శరన్, జయలక్మి పుత్రిక హేమ మాలిని

నిర్మాత : సీతారామ పుత్ర సాయి బాబా జాగర్లమూడి, కమల పుత్ర వై రాజీవ్ రెడ్డి

సంగీతం : భారతి పుత్ర చిరంతన్

భరత ఖండాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన శాతవాహన చక్రవర్తి, గొప్ప యోధుడు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్రను, గొప్పతనాన్ని, వీరత్వాన్ని ప్రజలకు తెలియజెప్పడానికి దర్శకుడు క్రిష్ బాలకృష్ణతో కలిసి చేసిన ప్రయత్నమే ఈ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. మొదటి నుండి మంచి అంచనాలను కూడబెట్టుకున్న ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వైభవంగా వచ్చింది. మరి క్రిష్ ఈ చిత్రం ద్వారా శాతకర్ణి కథను ఎలా చెప్పాడో చూద్దాం…

కధలోకి వెళ్తే: గౌతమి బాలాశ్రీ బిడ్డగా జన్మించిన శాతకర్ణి చిన్నతనం నుండే దేశంలో ఉన్న రాజుల మధ్య యుద్దాలు జరగకూడదు, అలా జరగకుండా ఉండాలంటే దేశంలో ఉన్న అన్ని రాజ్యాలను కలిపి ఒకే మహా సామ్రాజ్యంగా చేసి తానే సుభిక్షంగా పాలించాలని సంకల్పించుకుంటాడు. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఎలాంటి తెగువను ప్రదర్శించాడు ? ఎన్ని త్యాగాలను చేశాడు ? అనుకున్నది ఎలా సాధించాడు అన్నదే మిగిలిన కథ.

ఎలా ఉందంటే..?: సినిమాలో ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు క్రిష్ ఎంచుకున్న నేపధ్యం గురించి, తెలుగు జాతి పౌరుషాన్ని, గొప్పతనాన్ని చాటిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత కథ ప్రేక్షకుడికి మొదట్లోనే ఎమోషనల్ గా బాగా కనెక్టవుతుంది, ఎందుకంటే ఇది తెలుగు జాతి కథ.  మొదటి నుండి పౌరాణిక, చారిత్రక పాత్రలకు ప్రాణం పోసే బాలయ్య శాతకర్ణి పాత్రలోని రాజసం, పౌరుషం ప్రదర్శించడంలో నూటికి నూరు పాళ్ళు విజయం సాధించి ఆకట్టుకున్నాడు. యుద్ధ సన్నివేశాల్లో బాలకృష్ణ నటన అద్భుతంగా వుంది.

శాతకర్ణి పాత్రకు సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. వాటిని బాలయ్య పలికించిన తీరు సినిమా మొత్తానికి మేజర్ హైలెట్ ముఖ్యంగా ఆయన అభిమానులకైతే వీనుల విందనే చెప్పొచ్చు. ఇక దర్శకుడు క్రిష్ శాతకర్ణి జీవితం నుండి తీసుకున్న ప్రధాన అంశాలు అతనికి, అతని తల్లికి మధ్య ఉన్న అనుబంధం, శాతకర్ణి పట్ల అతని భార్య దృక్పథం, అఖండ భారతాన్ని శాతకర్ణి సాదించాలనుకోవడంలో అతని అంతరంగం, అనుసరించిన కఠిన మార్గాలు, ప్రదర్శించిన సాహసం వంటివి చూపడం నచ్చింది.

ఇక కథలో శాతకర్ణి భార్య వాశిష్టి దేవిగా నటించిన శ్రియ నటన బాగుంది. బాలకృష్ణకు, ఆమెకు మధ్య ఫస్టాఫ్, సెకండాఫ్లో నడిచిన కొన్ని ఏమోషనల్ సన్నివేశాలు బలంగా తాకాయి. అలాగే గౌతమి బాలాశ్రీ పాత్రలో హేమామాలిని నటన సినిమాకి మరో పెద్ద అసెట్. యుద్ధ సన్నివేశాల్లో టాప్ యాంగిల్ నుండి తీసిన షాట్స్ లో క్లారిటీ లేదు, ప్రధాన తారాగణం దుస్తులు విషయంలో తీసుకున్న జాగ్రత్త మిగిలిన నటుల విషయంలోనూ తీసుకుంటే ఇంకా బాగుండేది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే సంక్రాంతి కి బాలకృష్ణ అభిమానులకే కాదు తెలుగువారందరికీ ఒక మంచి సినిమా.. కాదు కాదు ఒక తెలుగు జాతి మహావీరుడి చరిత్రని తెలుసుకున్నాం అనే సంతృప్తి కలుగుతుంది.

సాంకేతిక వర్గం పని తీరు…?: రచయిత సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు అద్భుతంగా ఉన్నాయి, సినిమాకి హుందాతనాన్ని తెచ్చాయి. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది, సినిమాకు చారిత్రకపరమైన లుక్ తీసుకురావడంలో సక్సెస్ అయింది. ఇక చిరంతన్ భట్ సంగీతం, రచయిత సీతారామ శాస్త్రి పాటలకిచ్చిన సాహిత్యం ఉన్నతంగా ఉంది. బిబో శ్రీనివాస్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.

బలాలు:

  • బాలకృష్ణ
  • డైలాగ్స్
  • క్రిష్ టేకింగ్
  • మూవీ రన్ టైం

బలహీనతలు:

  • యుద్ధ సన్నివేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ (Top angle)
  • కాస్ట్యూమ్స్ (ప్రధాన తారాగణం మినహా)

రేటింగ్: 3.75/5