కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త మూవీ రివ్యూ మరియు రేటింగ్

Kittu Unnadu Jagratha Movie Review

విడుదల తేదీ: మార్చ్ 3, 2017

దర్శకత్వం: వంశీ కృష్ణ నాయుడు

నటీనటులు: రాజ్ తరుణ్, అను ఇమాన్యుయేల్, అర్బాజ్ ఖాన్

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

సంగీతం: అనూప్ రూబెన్స్

వరుస హిట్లతో దూసుకుపోతున్న రాజ్‌ తరుణ్‌ హీరోగా, అను ఇమ్మానుయేల్‌ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’. ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్‌ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై తెరకెక్కింది. వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల భారీ అంచనాలే పెట్టుకున్నారు… మరి ప్రేక్షకుల అంచనాలను కిట్టు ఏమాత్రం అందుకుందో ఇప్పుడు చూద్దాం…

కధలోకి వెళ్తే: 

కిట్టు(రాజ్ తరుణ్) అండ్ టీం కార్ కేర్ గ్యారేజ్ రన్ చేస్తూ మరో వైపు కుక్కలని కిడ్నాప్ చేసి వాటి ఓనర్స్ నీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇలా చేస్తుండగా ఒక రోజు అనుకోకుండా జానకి (అను ఇమాన్యుయేల్) ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. జానకిని కుడా తనను ప్రేమించేలా చేసుకుంటాడు కిట్టు… కొంత కాలం తర్వాత జానకి కి కిట్టు ఒక కుక్కల కిడ్నాపర్‌ అనే విషయం తెలుస్తుంది. దాంతో కిట్టు, జానకి విడిపోతారు. మరోవైపు డాన్ ఏఆర్‌(అర్ఫాజ్‌ఖాన్‌) సెలబ్రెటీలను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వారి ద్వారా తన అవసరాలను తీర్చుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో విడిపోయిన కిట్టు జానకి చివరకు ఎలా కలుసుకుంటారు ? డాన్ ఏఆర్‌ కు, కిట్టుకి ఉన్న సంబంధం ఏమిటి ? అసలు కిట్టు కుక్కలను ఎందుకు దొంగతనం చేస్తాడు అనే విషయాలు తెలియాలంటే మీరు తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?:

ఫస్ట్ హాఫ్ మొత్తం కుక్కలను కిడ్నాప్‌ చేయటం, కిట్టు -జానకిల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలతో సినిమా నడుస్తుంది. ముఖ్యంగా కుక్కలను కిడ్నాప్‌ చేసే సన్నివేశాలు సరదాగా సాగిపోతుంటాయి. విరామానికి ముందు కిట్టు-జానకి విడిపోవడం, జానకి కిడ్నాప్ కి గురికావడంతో కథలో ఆసక్తి మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ప్రతీ సన్నివేశమూ కీలకమే. రచయిత అందించిన కథను తెరపై చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.

కథానాయికను కాపాడుకునే విధానం, అందుకోసం హీరో చేసే ప్రయత్నాలు, కన్‌ఫ్యూజన్‌ డ్రామా మొదలైనవన్నీ చక్కగా పండాయి. రేచీకటి ఉన్నా, దాన్ని కవర్‌ చేసుకునే పాత్రలో 30 ఇయర్స్ పృథ్వీ నటన అలరిస్తుంది. దొంగబాబాగా రఘుబాబు, నవ్విస్తాడు… కాకపోతే ఆ పాత్రను మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. పతాకం సన్నివేశాలు సుదీర్ఘంగా సాగాయి. సినిమా స్టార్టింగ్ నుండి పవర్ ఫుల్ గా ఉన్న విలన్‌ పాత్రని చివరలో చాల సింపుల్ గా తేల్చేస్తాడు.

కథలో కొత్తదనం లేకపోయిన సన్నివేశాల్లో వినోదం జోడించటంతో సినిమా సాఫీగా సాగిపోతుంటుంది. రాజ్‌తరుణ్‌ మరోసారి ఎనర్జిటిక్‌ పాత్రలో కనిపించారు. తను ఈ సినిమాలో ఓ పాట కూడా రాయడం విశేషం. అను ఇమ్మాన్యుయేల్‌ గ్లామర్‌గా కనిపించింది… కానీ తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు ఎందుకంటే సినిమాలో లవ్ ట్రాక్ ఎక్కువగా లేకపోవడం వలన. నాగబాబు, వెన్నెల కిషోర్‌, రాజా రవీంద్ర తమ తమ పాత్రల వరకే పరిమితమయ్యారు.

సాంకేతిక వర్గం పని తీరు…?:

అనూప్ నేపథ్యం సంగీతం సినిమాకు తగినట్టు సాగింది. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అక్కడక్కడా అలరిస్తాయి. కెమేరా, ఎడిటింగ్‌ అన్నీ సమపాళ్లలో కుదిరాయి.

బలాలు:

  • కుక్కలను కిడ్నాప్‌ చేసే సన్నివేశాలు
  • పృథ్వీ వినోదం
  • మ్యూజిక్
  • రాజ్ తరుణ్
  • కామెడీ టైంయింగ్

బలహీనతలు:

  • హీరో, హీరోయిన్‌ లవ్‌ ట్రాక్‌
  • పతాక సన్నివేశాలు
  • రొటీన్ స్టోరీ

రేటింగ్: 3.25/5