ఓం నమో వెంకటేశాయ మూవీ రివ్యూ మరియు రేటింగ్

Om Namo Venkatesaya Review

విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2017

దర్శకత్వం : కె. రాఘవేంద్రరావు

నటీనటులు : నాగార్జున, సౌరభ్ రాజ్ జైన్, అనుష్క, ప్రగ్యా జైస్వాల్…

నిర్మాతలు : ఏ. మహేష్ రెడ్డి

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

కింగ్ అక్కినేని నాగార్జునతో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన మరో భక్తిరస చిత్ర్రమే ‘ఓం నమో వెంకటేశాయ’. సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలు భారీ గానే ఉన్నాయి… అటువంటి ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకువచ్చింది… మరి ప్రేక్షకుల అంచనాలను ఈ ఆధ్యాత్మిక చిత్రం ఏమాత్రం అందుకుందో ఇప్పుడు చూద్దాం..

కధలోకి వెళ్తే: ఉత్తర భారతదేశానికి చెందిన రామ్ (నాగార్జున) అనే వ్యక్తి చిన్నతనం నుండే దేవుడిని చూడాలి అనే కోరికతో తిరుమలలోని పద్మానంద స్వామి (సాయి కుమార్) అనే గురువు వద్దకు చేరుకొని విద్యనభ్యసించి, దేవుడి కోసం తపస్సుకు కూర్చుంటాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామి (సౌరభ్ రాజ్ జైన్) ప్రత్యక్షమవుతాడు. కానీ దేవుడ్ని అప్పుడు గుర్తించలేని రామ్ తరువాత తనకు కనిపించింది దేవుడే అని తెలుసుకుని మళ్ళీ దేవుని చెంతకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు… ఆ తర్వాత తిరుమల చేరతాడు…. ఈ క్రమంలో అతనికి శ్రీ వేంకటేశ్వర సామికి మధ్య బంధం ఎలా సాగింది ? రామ్ హాతిరామ్ బావాజి ఎలా అయ్యాడు ? హాతిరామ్ బావాజి జీవితం ఎలా సాగింది ? చివరికి అతని భక్తి అతడ్ని ఎక్కడకు చేర్చింది ? అనేది తెరపై  చూడాల్సిందే….

ఎలా ఉందంటే..?: సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది నాగార్జున, సౌరభ్ రాజ్ జైన్ ల నటన గురించి. ఈ చిత్రం ద్వారా నాగార్జున మరోసారి ‘అన్నమయ్య’ చిత్రాన్ని గుర్తు చేశారు. ఆయన నటన ఆరంభం నుండి చివరి దాకా ప్రతి సన్నివేశానికి జీవం పోసింది. కళ్ళలో ఉట్టిపడే భక్తి భావం, నడవడికలో క్రమశిక్షణ చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఎక్కడా ఒక అగ్ర హీరోలా కాకుండా పరమ భక్తుడిగానే కనిపించారాయన.

ఇక వేంకటేశ్వర స్వామి పాత్ర ధరించిన సౌరభ్ రాజ్ జైన్ ఆ పాత్రకు ప్రాణం పోశాడు. ఆహార్యంలో తేజస్సు, ముఖ కవళికల్లో, మాటల్లో ఆదరణను సున్నితంగ ప్రదర్శిస్తూ దేవుడినే చూస్తున్న భావన కలిగించాడు. ఆయన కనిపించిన ప్రతి సన్నివేశం కన్నార్పకుండా చూసేలా ఉంది. .ఇక కృష్ణమ్మ పాత్రలో అనుష్క నటన బాగుంది. ఇక దర్శకుడు రాఘవేంద్ర రావు మరోసారి తన దర్శకత్వానికి తిరుగులేదని నిరూపించారు. మొదటి భాగమంతా నాగార్జున జీవితం మీద, అతను తిరుమల చేరుకొని, ఆ క్షేత్రాన్ని బాగు చేయడం మీద నడిపి ఆకట్టుకుని ద్వితీయ భాగం మొత్తం దేవుడికి, భక్తుడికి మధ్యన గల హద్దులులేని భక్తి, ఆదరణ అనే అనుబంధాల్ని చాలా భావోద్వేగంగా ఆవిష్కరించి ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా రెండవ భాగంలో హాతి రామ్ బావాజి, వేంకటేశ్వర స్వామి మధ్య నడిచే పాచికలాట, భక్తుడే దేవుడికన్నా గొప్పవాడు అనే చెప్పే అంశం లాంటి సందర్భాలు మనసును కదిలించాయి. ఇక మధ్యలో వచ్చే కీరవాణి భక్తి పాటలు కూడా చాలా వినసొంపుగా ఉన్నాయి. నాగార్జున, ప్రగ్యా జైస్వాల్ ల మధ్య తెరకెక్కించిన ఒక రొమాంటిక్ సాంగ్ కూడ బాగుంది. తిరుమల వాతావరణాన్ని చాలా అందంగా చూపిన ఎస్. గోపాల్ సినిమాటోగ్రఫీ చాలా చక్కగా ఉంది.

ఇక సినిమా బలహీనతల్లో ముందుగా చెప్పాల్సింది రొటీన్ గా అనిపించే ఫస్టాఫ్ లో ని కొన్ని సన్నివేశాలు అలాగే ఫస్టాఫ్ లో రావు రమేష్ పాత్ర కొంత సేపు పవర్ ఫుల్ గా ఉన్నా అతని పాత్ర చుట్టూ అల్లిన కొన్ని సన్నివేశాల పాతవే కావడం నిరుత్సాహపరించింది. ఇక కథకు ప్రభాకర్ ధరించిన మాంత్రికుడి పాత్ర అవసరం సరైనదే అయినా దాన్ని అంత హడావుడిగా తేల్చేయడం కూడ అందరిని నిరుత్సాహపరించింది. ఇక సినిమాలో చివరి సన్నివేశంతో ఏంటి సినిమాని ఇంత తొందరగా ముగించేశారు అనే భావన కలుగుతుంది.

సాంకేతిక వర్గం పని తీరు…?: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారు భక్తి చిత్రాలను తెరకేక్కించడంలో తనకు సాటి లేదని మరోసారి ఇ సినిమాతో నిరూపించారు. కొన్ని భావోద్వేగపూరితమైన సన్నివేశాలు, వాటిలో ప్రతిభ ఉన్న నటీనటులతో చిత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారాయన. జె.కె. భారవి అందించిన కథ కాస్త కల్పితమే అయినా కూడా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజెప్పింది. భక్తి పాటలకు కీరవాణి అందించిన సంగీతం చాలా బాగుంది. ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. అది సినిమాకి అదనపు బలమవుతుందనడంలో సందేహమేలేదు. గౌతమ్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది. సాయి కృపా సంస్థ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

బలాలు: 

  • నాగార్జున నటన
  • సౌరభ్ రాజ్ జైన్, అనుష్క నటన
  • సినిమాటోగ్రఫీ
  • మ్యూజిక్

బలహీనతలు:

  • కొన్ని సన్నివేశాలు
  • కొన్ని  పాటలు
  • సపోర్టింగ్ క్యారెక్టర్స్ పెర్ఫార్మన్స్

రేటింగ్: 3/5

Om Namo Venkatesaya Movie Review, nagarjuna new telugu movie, nagarjuna Om Namo Venkatesaya Movie Review, latest telugu movie review, 2017 latest telugu movies,